Monday, February 11, 2013

Medical facilities in Govt.regional hospital,ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు

  •  

  •  
వైద్యుల్లేక కొన్ని... పరికరాలు లేక మరికొన్ని...చికిత్సల కోసం రోగుల పాట్లు-శాపంగా మారిన ప్రభుత్వ విధాన వైఫల్యాలు!-పడకేసిన 'సామాజిక' వైద్యం!
బోసిపోతున్న  ఆస్పత్రులు, కనీసపాటి వైద్య సదుపాయాలకూ నోచుకోక గ్రామీణ ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కాస్తంత దూరంలో సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నప్పటికీ అవి ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రసవాలు తదితరాలు చేయడానికి ఒక మహిళా వైద్యురాలు, శస్త్రచికిత్సలు చేయడానికి ఒక నిపుణుడు, మత్తుమందు ఇచ్చే నిపుణుడు, చిన్నపిల్లల వైద్యులు, ఒక ఫిజీషియన్‌ తప్పనిసరిగా ఉండాలి. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మొత్తం  రాస్ట్రం లో 281 ఆస్పత్రుల్లో 1405 మంది ప్రత్యేక(స్పెషాలిటీ) విభాగాలకు చెందిన వైద్యనిపుణులు తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నా... 880 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 525 (37%)మంది మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరవుతున్నారు. వీరిలోనూ సగం మందికి పైగా సొంత ఆస్పత్రులున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరైనా ఈ వైద్యుల ధ్యాస అంతా సొంత క్లినిక్కులపైనే. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందవని తమ ప్రైవేటు క్లినిక్కులకు రావాలని ఒత్తిడి చేసి రోగులను తీసుకువెళుతున్నారు. ఈ విషయం వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా, బాధ్యులపై ఎలాంటి చర్యల్లేవు. ఈ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వైద్యులు ఉంటారనే భరోసా లేకుండా పోయింది. వెళ్లటానికి రోగులూ వెనుకంజ వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నపిల్లలు, గర్భిణులు, శస్త్రచికిత్సలు అవసరమైన వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

 జీతాలు!

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక విభాగాల్లో పనిచేసే వైద్యులకు నెలకు రూ.35 వేల నుంచి రూ.40వేలు వరకు జీతభత్యాల కింద ఇస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు రూ.లక్ష వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఉంటున్నాయి. ఈ కారణంగానే చాలా మంది ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను 80%కి పైగా పెంచాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు చాలా కాలం నుంచి కోరుతున్నారు. వేతనాలు పెంచి ప్రైవేటుగా సొంత క్లినిక్కుల నిర్వహణపై నిషేధం పెట్టవచ్చని చెబుతున్నారు. ఈ తరహా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత చాలా వరకు తీరుతుంది. ఆస్పత్రులకు వచ్చే రోగులందరికీ వైద్యసేవలు అందుతాయి. ఇందుకోసం వైద్య బడ్జెట్‌ను రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్లు పెంచితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ఇలాంటి చర్యలు తీసుకోకుండా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేవలం రెండు శాతంలోపు ఉండే జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం రూ.1450 కోట్ల వరకు ఏటా ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం కింద ఖర్చు చేస్తున్న మొత్తంలో ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులు లబ్ధి పొందుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ప్రధాన సమస్యగా మారుతున్నా, సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పర్యవేక్షణ వైఫల్యం:

సామాజిక ఆస్పత్రుల్లో 178 చోట్ల ల్యాబ్‌టెక్నీషియన్ల కొరత ఉంది. 127 చోట్ల వైద్యనిపుణులున్నా చికిత్సలు చేయడానికి అవసరమైన వైద్యపరికరాలు లేవు. ఈ ఆస్పత్రుల్లో పరికరాల కోసం రూ.60 కోట్లు అవసరమని ఏడాది కిందట అధికారులు అంచనా వేసినా, ఇప్పటి వరకు ఆ దిశగా చర్యల్లేవు. వైద్యులున్న చోట పరికరాల్లేవు. పరికరాలున్న చోట వైద్యుల్లేరు. ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం.

  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -