Sunday, April 3, 2011

రాజాం జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రి , GMR care hospital.Rajam





రాజాం సిగలో జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రి : రాజాం పట్టణంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గ్రంధి మల్లిఖార్జునరావు (జీఎంఆర్‌) అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన కేర్‌ ఆసుపత్రిని శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ప్రముఖులు ప్రారంభించి సేవలకు పచ్చజెండా ఊపారు.జిల్లా ముంగిట్లోకి అత్యంత ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.మెట్రోపాలిటన్‌ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్‌ వైద్యాన్ని రాజాం లాంటి మారుమూల ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావటాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ.. గ్రంధి మల్లిఖార్జునరావును అభినందించారు. జీఎమ్మార్‌ స్ఫూర్తిగా పారిశ్రామికవేత్తలు సామాజిక సేవలు విస్తరించాలని ప్రముఖులంతా పిలుపునిచ్చారు. 120 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒరిస్సాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలకు విస్తృతస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చినట్లు జీఎంఆర్‌ కేర్‌ యూనిట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ రాజేంద్ర తెలిపారు. ప్రస్తుతం 130 పడకలతో ఆసుపత్రి ప్రారంభిస్తున్నామని,వచ్చే ఏడాది నాటికి 200 పడకల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి నట్లు ఆయన తెలిపారు. అనంతరం రెండేళ్లలో 500 పడకలకు పెంచుతామన్నారు. అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని, ఐసీయూ, శస్త్ర చికిత్స విభాగాలను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా పారామెడికల్‌ విద్యను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఆరు నెలల్లో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. జీఎంఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పేదలకు ఆర్థికసాయం అందించి ఇక్కడ సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిగిలిన వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు ఫౌండేషన్‌ ద్వారా అవగాహన కల్పించి వైద్య బీమా పథకంలో అందరినీ చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అత్యాధునిక పరికరాలు
* అత్యాధునిక 4 శస్త్ర చికిత్స గదులు, అత్యవసర విభాగం అందుబాటులోకి తీసుకొచ్చారు.
* అత్యాధునిక సిటీ స్కాన్‌, డిజిటల్‌ ఎక్స్‌రే సమకూర్చారు.
* ఆటో ఎనలైజర్స్‌ ద్వారా అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ 100 నమూనాలను ఒకే సారి పరీక్ష చేయవచ్చు.
* సియోనెటాలజీ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనిని చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

పేదలకు వూరట
జీఎమ్మార్‌ వరలక్ష్మి కేర్‌ ద్వారా పేదలకు 33 శాతం నుంచి 100 శాతం ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని గ్రంధి మల్లిఖార్జునరావు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విశాఖపట్టణంతో పోలిస్తే 30 శాతం తక్కువకే వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.

  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao.com