సాదారణము గా మందుల వ్యాపారము ఏరీతిలో ఉందంటే ...
8 శాతం మందులు పనిచేయవు
రోగం తగ్గుతుందన్న భరోసా లేదు
ప్రమాణాల్లో కంపెనీలు విఫలం
ఉత్తరాది ఫార్మాలు మరీ ఘోరం
ఔషధ నియంత్రణకు సిబ్బంది లేరు---------- ఇదీ మందుల మాయాజాలం.
శ్రీకాకుళం జిల్లాలో సుమారరు 800 రిటైల్ మందుల దుకాణాలు , 146 హోల్సేల్ దుకాణాలు , 4 మందుల తయారీ కంపెనీలు , రిమ్స్ రక్తనిధి , రెడ్ క్రాస్ రక్తనిది (మొత్తం రెండు ) కేంద్రాలు ఉన్నాయి . ఇందులో కొన్ని హోల్ సేల్ షాపులు . ఇన్ని మందుల షాపులు ప్రమాణాలు పాటిస్తున్నయో లేదో తనికీ చేయడానికి ఉన్నది ఒక్క డ్రగ్ ఇంస్పెక్టరే . ఎలా సాధ్య పడుతుంది ? .
ఇటీవలికాలంలో తరచుగా మందులు వాడుతున్నా జబ్బు తగ్గడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మందుల్లో నాణ్యత నిర్దేశించిన పరిమాణంలో లేకపోవడమే దీనికి కారణం. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇతర రాష్ట్రాల్లో తయారైన మందుల నాణ్యత నిర్దేశిత ప్రమాణాల్లో లేదని తేలుతోంది. దేశవ్యాప్తంగా మందుల నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థ పటిష్ఠంగా లేదు. మార్కెట్లో ఉన్న మందుల్లో 8 శాతం అనుమానించ తగినవని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దీనికి బలం చేకూరుస్తోంది. మందుల నాణ్యత నిర్ధారణలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమల్లో లేకపోవడంతో నాసిరకాన్ని గుర్తించడం క్లిష్టంగా మారుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన కొన్ని మందుల నాణ్యత నాసిరకంగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు లేవు. మన రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ శాఖలో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాసిరకం మందులకు కళ్లెం వెయ్యలేకపోతున్నారు.
రాయితీలు : హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లు ఔషధ పరిశ్రమలకు భారీగా రాయితీలను ప్రకటిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 2001 నుంచి పరిశ్రమలపై ఎక్సయిజ్ డ్యూటీ, అమ్మకం పన్నును పూర్తిగా మినహాయించారు. రాయితీల వర్షంతో 3 రాష్ట్రాల్లో 600 ఔషధ పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఒక్క హిమాచల్‌లోనే 400కు పైగా కంపెనీలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మందుల నాణ్యతను పరీక్షించడానికి కేవలం 10 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో మొక్కుబడి తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌ల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. పంజాబ్‌లో నకిలీ మందుల తయారీ పరిశ్రమగా సాగుతోంది. వీటిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రెండేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రాష్ట్రంలో తనిఖీ తీరు
మన రాష్ట్రంలో మందుల నాణ్యత పరీక్షలు నిరాశాజనకంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో 51 వేలకు పైగా మందుల దుకాణాలు, 1791 తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేయడానికి ప్రతీ 100 మందుల దుకాణాలకు ఒకరు చొప్పున 510 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కావాలి. ప్రతీ 25 మందుల తయారీ సంస్థలపై ఒక ఇన్‌స్పెక్టర్ చొప్పున మరో 72 మంది ప్రత్యేక నిఘా అధికారులు అవసరం. మొత్తం 582 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా పని చేస్తున్నది కేవలం 46 మంది. సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా రెండేళ్ల కింద 75 పోస్టులు మంజూరు చేశారు. భర్తీ మాత్రం జరగలేదు. దాంతో రాష్ట్రంలోనూ ఆశించిన స్థాయిలో నాణ్యత పరీక్షలు జరగడం లేదు.
నిపుణుల సూచనలు
* మందుల నాణ్యత తనిఖీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాలను అమలు చేయాలి.
* ఉత్పత్తి అయిన మందుల నాణ్యత నిర్దేశించిన ప్రమాణాల్లో లేదని నిర్ధారణ అయితే సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకునే విధానం రావాలి.
* మందుల నాణ్యతను నిర్ధారించేందుకు తయారీ సంస్థలు సూచించే విధానాలను మాత్రమే ఔషధ నియంత్రణ అధికారులు అనుసరిస్తున్నారు. దీనివల్ల నాణ్యతా లోపాలను గుర్తించడం క్లిష్టంగా మారుతోంది.
* ఔషధాలపై పరిశోధనలు చేసే సంస్థలకు అనుబంధంగా నాణ్యత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* ఔషధ నియంత్రణ శాఖలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
నిర్ధారణ :
* ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే నకిలీ మందుల్లో 35 శాతం భారత దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. - ప్రపంచ ఆరోగ్య సంస్థ
* దేశంలో నకిలీ మందుల అమ్మకం ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది. - అసోచామ్..
* మార్కెట్లోని మందుల్లో ఎనిమిది శాతం అనుమానించదగ్గవి --కేంద్ర ఆరోగ్య శాఖ.
News from Eenadu paper - 13-April -2011
కేంద్ర నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో 256 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అవసరం. కానీ ఉన్నది 47 మందే. దేశం మొత్తంలోకీ దారుణమైన రీతిలో దాదాపు 900 షాపులకొక తనిఖీ అధికారితోనే సరిపెట్టేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఔషధ నియంత్రణ విభాగం పనితీరుకు ఉదాహరణ .
మందుల నాణ్యతా పరిరక్షణ, నకిలీ, ప్రాణాంతకమైన వాటిని కనిపెట్టడం, అధిక ధరలను, తప్పుడు వ్యాపార ప్రకటనలను నిరోధించడం.. ఔషధ నియంత్రణ విభాగం విధులు. కానీ, తగిన వనరుల్లేక అది కుంటినడక నడుస్తోంది. రాష్ట్రానికి రెండు దశాబ్దాల క్రితం 55 డ్రగ్ ఇన్‌స్పెక్టర్(డీఐ) పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆ సంఖ్య పెరగకపోగా 8 ఖాళీ అయ్యాయి. రాష్ట్రంలో 198 బ్లడ్ బ్యాంకులు, 1,734 మందుల ఉత్పత్తి సంస్థలు, 51 వేలకుపైగా షాపులూ ఉన్నాయి. హాథి కమిషన్ సిఫార్సుల మేరకు ప్రతి 200 షాపులకొకరు, ప్రతి 26 ఉత్పత్తి సంస్థలకొకరు చొప్పున మొత్తం 256 మంది డీఐలు విధిగా ఉండాలని మూడేళ్ల క్రితం కేంద్రం ఆదేశించింది. కానీ దాన్ని అమలుచేయలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ చాలా వరకు దానిని పాటించినా ఇక్కడ స్పందన లేదు. గత మార్చిలో శాసనసభలో ఈ విషయమై ఆందోళన వ్యక్తమైనప్పుడు కాంట్రాక్టు పద్ధతిపై వెంటనే 50 మందిని తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అదీ జరగలేదు. శాశ్వత నియామకాల కోసం ఏపీపీఎస్సీకి లేఖ రాసి చేతులు దులుపుకొంది. దేశంలో ఎక్కడాలేని విధంగా డీఐలకు పనిభారం ఎక్కువ. అందుకు తగ్గట్లు వనరుల్లేవు. ప్రస్తుతం వీరికి ఫోన్ సౌకర్యం కూడా లేదు. పొదుపు పేరిట గత ఏడాది చివర్లో సెల్‌ఫోన్లను తొలగించారు. ఫలితంగా వినియోగదారులు నకిలీ మందుల సమాచారం అందించడానికీ వీలుకావడం లేదు. అత్యవసర సమయాల్లో దాడులకు అవసరమైన వాహన సౌకర్యమూ వీరికి లేదు. వనరుల లేమికి అవినీతి జాఢ్యం తోడవుతోంది. మందుల షాపుల నుంచి అధికారులకు మామూళ్లు ఆనవాయితీ అయ్యాయి. ఈ విభాగం ప్రధాన కార్యాలయానికి రెండు కార్లు, ప్రాంతీయ అధికారులకు నాలుగు జీపులు ఉన్నాయి. ఇవి పాతికేళ్ల కిందటివి. 15 ఏళ్ల వాహనాలను నిషేధించడంతో వీటికి కాలం చెల్లింది. అయినా విధిలేక వాటినే వాడుతున్నారు.
తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న మందులను పరీక్షించడానికి హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే ప్రయోగశాలలున్నాయి. వీటిలోనూ సరైన సౌకర్యాలు లేక ఫలితాల కోసం నెలల తరబడి జాప్యం జరుగుతోంది. వీటిలో 6 జూనియర్ ఎనలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌కోసం ప్రయోగశాలల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా ఒక్కో సీనియర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌ను, ముగ్గురేసి జూనియర్ ఎనలసిస్ట్‌లను అదనంగా నియమించడానికి కేంద్రం ముందుకొచ్చింది. కానీ వ్యయంలో 20% వాటా భరించడానికి రాష్ట్రం చొరవ చూపడం లేదు.
ఇన్ని సమస్యల నేపథ్యంలో ఉన్న సిబ్బంది విధులను సరిగా నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడింది. నిర్దేశిత కోటా శాంపిళ్ల సేకరణ మినహాయిస్తే విస్తృత స్థాయిలో మందుల షాపుల తనిఖీలు జరగడం లేదు. నాసిరకం మందుల ఆరోపణలు వచ్చినా మొక్కుబడిగా దాడులు జరుగుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో శాంపిళ్లతో పాటు నాసిరకం మందుల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి
- ==================================
No comments:
Post a Comment
Your comment is very important to improve this blog/site