జ్వరం, జలుబు, దగ్గు, దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, కిడ్నీ తదితర వాటితో బాధపడే వారికి అవసరమైన మందుల విషయంలో నేనున్నానంటూ అభయం ఇస్తోంది ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్న మెడిసిన్ బ్యాంకు. శ్రీకాకుళం పట్టణంలో 2006 నవంబరు 9న ప్రారంభించారు. ఇప్పటివరకు మెడిసిన్ బ్యాంకు ద్వారా 7,062 మందికి అల్లోపతి (ఇంగ్లీషు), హోమియో మందులు పంపిణీ చేశారు. శనివారం (01 మే 2010)ప్రత్యేకంగా స్త్రీ సంబంధమైన వ్యాధుల కోసం సేవలు అందిస్తారు. నిరుపేదలు ఈ బ్యాంకుకు వెళ్లి తమ తమ వ్యాధులు వివరిస్తే చాలు,, అక్కడి వైద్యులు అవసరమైన పరీక్షలు చేయించి నివారణకు ఉపయోగపడే మందులు ఉచితంగా అందజేస్తారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు సేవలు పొందుతున్నారు. అవసరాన్ని బట్టి అల్లోపతి, హోమియోపతి మందులు అందజేస్తారు. ఈ బ్యాంకులో పలువురు వైద్యులు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుండటం అభినందనీయం.
మందుల సేకరణ
మెడిసిన్ బ్యాంకుకు పలువురు వైద్యులు, మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, తదితరులు తమ వంతు సాయంగా వివిధ వ్యాధుల నివారణకు అవసరమయ్యే మందులు అందజేస్తుంటారు. వీటిని అవసరమయ్యే రోగులకు పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడి కొచ్చే వారిలో ఎక్కువగా వృద్ధులు ఉంటున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, నిస్సత్తువ, తదితర రోగాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
వివిధ వ్యాధులకు సంబంధించి మందులు వాడుతున్న వారు కొన్ని సందర్భాల్లో ఆ కోర్సు ఆపేసి కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మందులు పనికిరానివిగా భావించి బయట పారేస్తుంటాము. ఇలా చేయకుండా వాటిని రెడ్‌క్రాస్‌కు అందజేస్తే వైద్యులు అవి ఏ వ్యాధికి పనికొస్తాయి, ఎప్పటివరకు వాటి వాడకం తేదీ ఉందో క్షుణ్ణంగా పరిశీలించి ఆయా మందులను ఒకచోట జాగ్రత్తచేస్తారు.
తోడ్పడండి: జగన్మోహనరావు(అధ్యక్షులు రెడ్ క్రాస్ -శ్రీకాకుళం )
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వినియోగించగా మిగిలిపోయిన మందులను పారేయకుండా పొట్టిశ్రీరాములు కూడలిలో గల జిల్లా రెడ్‌క్రాస్ కార్యాలయానికి, బాపూజీ కళామందిర్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ రక్తనిధికి అందజేయాలని అధ్యక్షులు పి.జగన్మోహనరావు కోరారు. ఇప్పటివరకు 7,062 మందికి మందులు అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలైన వారికి ఆరోగ్యకార్డులు అందజేస్తామని చెప్పారు. పట్టణ పరిధిలో 400 మందికి ఇప్పటికే వీటిని ఇచ్చినట్లు వెల్లడించారు. మెడిసిన్ బ్యాంకుకు విరాళంగా మందులు ఇవ్వదలచుకున్నవారు 9440195900 సెల్‌కు ఫోన్‌చేసి సంప్రదించాలని కోరారు.
- =================================================
No comments:
Post a Comment
Your comment is very important to improve this blog/site