Saturday, July 14, 2012

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ 2012 , MBBS councelling 2012




* రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో...* ఈనెల 20 నుంచి 27వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌.........
ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, -రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈనెల 20 నుంచి 27వరకు నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.వేణుగోపాలరావు తెలిపారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీయూ, విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ చేపడతారు. ఎంసెట్‌ ర్యాంకుల మెరిట్‌ ఆధారంగా ఈనెల 20న 1-900 ర్యాంకుల వారికి, 21 న 901- 2400 ర్యాంకుల వరకు, 22న 2401- 5000 ర్యాంకుల వారికి, 23న 5001 నుంచి 7000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి అదేరోజు నుంచి బీసీ అన్ని కేటగిరీలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ చేపడతారు. అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబరు 31 కల్లా 17
సంవత్సరాలు నిండిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌ అర్హులు. అనగా 02.01.1996 తేదీ తర్వాత పుట్టిన వారు కౌన్సెలింగ్‌కు అనర్హులుగా నిర్ణయించారు.

విద్యార్హతల్లో ఓసీ కేటగిరీ అభ్యర్థులు ఇంటర్‌, ఎంసెట్‌లో 50 శాతం (80 మార్కులు), బీసీ/ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40శాతం (64 మార్కులు), వికలాంగులకు 45శాతం (72మార్కులు) ఉన్న వారికే కౌన్సెలింగ్‌కు అనుమతి ఇస్తారు. జీవో నెంబరు 42 ప్రకారం అన్‌ రిజర్వుడు సీట్లకు ముందు కౌన్సెలింగ్‌ చేపట్టిన అనంతరం లోకల్‌ ఏరియా సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రత్యేక కేటగిరీ ఆంగ్లో ఇండియన్‌, స్పోర్ట్సు,గేమ్స్‌, ఆర్మీ సంతతి, ఎన్‌సీసీ, వికలాంగులు అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్‌ తర్వాత ప్రకటిస్తారు. కౌన్సెలింగ్‌ సీట్లు పొందిన అభ్యర్థులు వారి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులు పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలి. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆయా వైద్య, దంత కళాశాలల్లో తరగతులకు హాజరుకావల్సి ఉంటుంది. ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌
షెడ్యూలు, కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి తీసుకురావల్సి సర్టిఫికేట్ల వివరాలు, మార్గనిర్దేశకాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌http://ntruhs.ap.nic.inలో పొందుపర్చారు.

  • కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే సీట్లివీ...
ఎంబీబీఎస్‌ కోర్సులో 14 ప్రభుత్వ కళాశాలలో2050 సీట్లు,
22 ప్రైవేటు కళాశాలల్లో 3050 సీట్లుండగా అందులో 1830 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేస్తుంది. అలాగే ఈ ఏడాది ఎంసీఐ

అనుమతులొచ్చిన మూడు మైనార్టీ కళాశాలల్లో 400 సీట్లుండగా వాటిని ఆయా యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి.
* బీడీఎస్‌ కోర్సులో మూడు ప్రభుత్వ కళాశాలలో 180 సీట్లుండగా, 16 ప్రైవేటు కళాశాలల్లో 1450 సీట్లుండగా అందులో ఎ,బి కేటగిరీ కోటా కింద 870 సీట్లను యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. అలాగే సికింద్రాబాద్‌లోని ఆర్మీ దంత కళాశాలలో ఉన్న 40 సీట్లలో ఆరుసీట్లను కన్వీనర్‌ కోటా కింద యూనివర్సిటీ భర్తీ చేస్తుంది.

  • వైద్యవిద్యకూ సుస్తీ!
నాణ్యత ప్రమాణాల రీత్యానే కాదు, ప్రవేశాలపరంగానూ వైద్య విద్యారంగం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్య మెరుగుదలకు విశ్వసనీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరంపై వూకదంపుడు ఉపన్యాసాలతో ప్రధానమంత్రి పొద్దుపుచ్చుతుంటే, ఉన్న వ్యవస్థలూ రుజాగ్రస్తమైన తీరు- ఔత్సాహికుల ఆశల్ని చిదిమేస్తోంది. భారతావనిలో వైద్యసేవలకు మరో ఆరు లక్షలమంది డాక్టర్లు, పది లక్షలమంది నర్సులు, రెండు లక్షలమంది దంత చికిత్సా నిపుణుల అవసరం ఉందని ప్రణాళిక సంఘం నివేదికే ఇటీవల వెల్లడించింది. అంత భారీస్థాయిలో నిపుణ వైద్యుల్ని రూపొందించుకోవాలంటే- ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల స్థాయి పెంపుదల మొదలుకొని, కొత్త కాలేజీల ఏర్పాటు, మెరికల్లాంటి బోధన సిబ్బంది సమీకరణ, వనరుల లభ్యత తదితర కీలకాంశాలన్నింటిమీదా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దృష్టి సారించాలి. నిరుడు జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సదస్సు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను 250దాకా పెంచాలని నిర్ణయించడంతో కొత్తగా 1,300సీట్లు అందుబాటులోకొస్తాయని రాష్ట్ర విద్యార్థులు సంతోషించారు. 'హైదరాబాద్‌ డిక్లరేషన్‌'
ప్రాతిపదికన రాష్ట్రంలోని 23 ప్రైవేటు కాలేజీల్లో మరో 2,750సీట్లు పెరుగుతాయనీ అంచనాలు వెలువడ్డాయి. తీరా భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) ఇటీవల అనుగ్రహించిన సీట్లు- ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు కలిపి ఏడొందలు! ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 150 సీట్లే పెరగడం యంత్రాంగం ఉదాసీనతకు పరాకాష్ఠగా నిలుస్తోంది. వైద్య విద్యా ప్రవేశాలకోసం రాష్ట్రంలో లక్షమంది 'ఎంసెట్‌' రాస్తుంటే- కొత్తగా వచ్చినవాటితో కలిపి మొత్తం ఉన్న సీట్లు అయిదున్నరవేలు! ప్రైవేటు కళాశాలల్లో 40శాతంగా ఉన్న యాజమాన్య కోటాలో ఒక్కోసీటూ అరకోటికిపైగా రేటు పలుకుతుండటంపై ఆందోళన ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టుకెక్కింది. కచ్చితమైన ప్రమాణాలే గీటురాయి అయితే, ఉస్మానియాలో ఉన్నసీట్లకూ ఎసరొస్తుందని మంత్రులే అంటుంటే, కాలేజీల నిర్వహణ భారం తలకు మించిన భారమవుతోందని ప్రైవేటు యాజమాన్యాలు మొత్తుకొంటున్నాయి. దానాదీనా వైద్య విద్యారంగమే బహుముఖంగా వ్యాధిగ్రస్తమై కుములుతోంది!

వైద్యవిద్య ఖరీదైన వ్యవహారం అనడంలో మరోమాట లేదు. సంక్షేమరాజ్య భావనకు గొడుగు పట్టాల్సిన ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా వైద్య కళాశాలల్ని పరిపుష్టీకరించి విస్తరించడం; ధార్మిక, ప్రైవేటు సంస్థలకు తగు ప్రోత్సాహకాలిచ్చి కొత్త కాలేజీల్ని ఏర్పాటు చేయించడంద్వారా వైద్యసేవల్ని ఇతోధికం చెయ్యడం- ప్రజలపట్ల నిబద్ధతతో సాగాల్సిన క్రతువు! కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్నవాటిలో సీట్ల పెంపుదలకు అనుసరించాల్సిన వ్యూహరచనకోసం రాష్ట్రప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలోనే ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. జస్టిస్‌ జీవన్‌రెడ్డి సూచనల్ని దృష్టిలో ఉంచుకొని వైద్యవిద్యా ప్రమాణాల్ని పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, మరో దశాబ్దకాలంపాటు వైద్య అవసరాలకు సరిపడా మానవ వనరుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకే ఉన్నతాధికార కమిటీ అంటూ హడావుడి చేసింది. ఆ కమిటీ నివేదిక నేటికీ అతీగతీ లేదు. ఈలోగా తనవంతు నిర్మాణాత్మక చొరవ చూపడంలో రాష్ట్రసర్కారు వైఫల్యం- సర్కారీ బోధనాసుపత్రుల దయనీయావస్థలో, కొత్తగా సీట్లు మంజూరుకాని వాస్తవంలో ప్రస్ఫుటమవుతూనే ఉంది. ఒక్కో సీటుకు కనీసం అయిదు పడకలుండాలన్నది నియమం. యాభైసీట్లు పెరగాలంటే కొత్తగా 250 పడకలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. మందుల పద్దుకే
డబ్బులివ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం- కనీసం కేంద్రం గ్రాంటుగా ఇచ్చిన మొత్తాన్ని అయినా సద్వినియోగం చేసుకోకపోవడమే విషాదం! అలా- ఏటా రూ.10వేల ఫీజుతో వైద్యవిద్యను అభ్యసించే సదవకాశం 1,100మంది ఎంసెట్‌ మెరికలకు దూరమైపోయింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎంసీఐ తమపని తాము సక్రమంగా చేస్తే- ప్రతిభకు గోరీ కడుతున్నారంటూ విద్యార్థిలోకం ఏటా గళమెత్తే దుర్గతి ఎందుకు దాపురిస్తుంది?

ఆరోగ్య రంగంమీద బాగా శ్రద్ధ చూపించే ఉక్రెయిన్‌, కిర్గిజిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, మధ్య అమెరికా దేశాలు, చైనా, రష్యాలాంటివీ పరిమిత ఫీజులతోనే వైద్యవిద్యను అందిస్తున్నాయి. డొనేషన్ల బాదరబందీ లేకుండా భారత విద్యార్థుల్నీ సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. ఇండియా ఏటా 70వేలమంది డాక్టర్లను
రూపొందించుకోవాల్సి ఉందని అధ్యయనాలు చాటుతున్నా, దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ సీట్లు 45వేలు! ఆరోగ్యరంగంపై స్థూల దేశీయోత్పత్తిలో జర్మనీ 7.8శాతం వ్యయీకరిస్తుంటే, బ్రిటన్‌(7.2), అమెరికా(7.3), జపాన్‌(6.7), రష్యా(3.1), చైనా(2.0)లతో పోలిస్తే భారత్‌ ఖర్చు చేస్తున్నది కేవలం 1.4శాతం! ఈ అరకొర కేటాయింపులే దేశంలో వైద్యవిద్య విస్తరణకూ గండి కొడుతున్నాయన్నది నిష్ఠురసత్యం! ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు కచ్చితంగా తమ విధానాలనే అనుసరించాలని ప్రభుత్వం నిర్దేశించలేదంటూనే- వాటిలో కనీస ప్రమాణాలకు పెద్దపీట వేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు 2005నాటి తీర్పులో ప్రస్తావించింది. సీట్ల భర్తీ విషయంలో ప్రతిభ, పారదర్శకతలకు ప్రాధాన్యం దక్కాలనీ తీర్పు స్పష్టీకరిస్తోంది. యాజమాన్య కోటా ఫీజు అయిదున్నర లక్షల రూపాయలుగా నిర్ధారించిన ప్రభుత్వం- అంతకు పదింతల వసూళ్లు, సీట్ల భర్తీలో ప్రతిభకు తూట్లు వంటి అంశాలపై తనవంతుగా ఏనాడూ స్పందించనేలేదు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఒక్కో ఎంబీబీఎస్‌ విద్యార్థిమీదా ఏటా రూ.31లక్షల పైచిలుకు ఖర్చు చేస్తోందని ఆ సంస్థ అధ్యయనం చాటుతోంది. అత్యున్నత ప్రమాణాలతో వైద్యవిద్యను అందించడానికి అంతంత వ్యయం అవుతుందని తెలిసినప్పుడు- యాజమాన్య కోటా రుసుముల
నిర్ధారణలో ప్రభుత్వాలు శాస్త్రీయంగా వ్యవహరించాలి. ప్రతిభావంతుల్ని వైద్య విద్యారంగం అపర ధన్వంతరుల్లా తీర్చిదిద్దాలంటే- ప్రభుత్వాల విధానాలనుంచి ఎంసీఐ నిర్వహణ దాకా సమగ్ర క్షాళన జరిగి తీరాలి!

source : Telugu News papers

  • =================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site