Monday, July 2, 2012

ఆంధ్రప్రదేశ్ లో ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు , Increase in MBBS seats in A.P





రాష్ట్రానికి 750 ఎంబీబీఎస్‌ సీట్లు,
ప్రభుత్వ కళాశాలల్లో 150,
ప్రైవేటు కళాశాలల్లో 600 సీట్లు,

ఎంబీబీఎస్‌లో ఈ ఏడాది 750 సీట్లు అదనంగా దక్కాయి. విశాఖపట్టణం, విజయవాడ, కర్నూలు వైద్యకళాశాలల్లో 50 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రైవేటులో నాలుగు కళాశాలల్లో ఒక్కో చోట 50 చొప్పున సీట్లను అదనంగా మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మూడు ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతో 400 సీట్లు వచ్చాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కొత్త కళాశాలల అనుమతులతో పాటు అదనపు సీట్ల మంజూరుపై జులై 15 వరకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పక్షాన సీనియర్‌ మంత్రి దీని కోసం కృషి చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకులతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని వైద్యవిద్యాశాఖ అధికారులు చెప్పారు. అదనపు సీట్ల మంజూరులో గత రెండేళ్లుగా భారతీయ వైద్యమండలి అధికారులు చిన్నపాటి సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్‌ సీట్ల పెంపు విషయంలో కేంద్రంపై రాజకీయపరంగా ఒత్తిడి పెంచాల్సిన ఉందన్నారు.

  • ఎంబీబీఎస్‌ సీట్లు వివరాలు :
* ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం 1,900 సీట్లున్నాయి. ఈ ఏడాది వీటికి అదనంగా ఆంధ్ర వైద్యకళాశాల, విశాఖపట్టణం(50); సిద్ధార్థ వైద్యకళాశాల, విజయవాడ(50); ప్రభుత్వ వైద్యకళాశాల, కర్నూలు(50)లో మొత్తం 150 సీట్లు పెరుగుతున్నాయి.

* ప్రైవేటులో ప్రస్తుతం 2,850 సీట్లున్నాయి. విశాఖపట్టణంలో ఒకటి, హైదరాబాద్‌లో రెండు కొత్త ప్రైవేటు కళాశాలలకు అనుమతులు వచ్చాయి. వీటిలో 400 సీట్లు మంజూరయ్యాయి. వీటికి అదనంగా అల్లూరి సీతారామరాజు వైద్యవిజ్ఞాన సంస్థ(ఏలూరు), కాటూరి వైద్యకళాశాల(గుంటూరు), మహరాజ వైద్యవిజ్ఞాన సంస్థ(విజయనగరం), మెడిసిటీ(హైదరాబాద్‌)లోని ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో చోట 50 చొప్పున 200 సీట్లు పెరిగాయి.

* ప్రస్తుతానికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 5,500 సీట్లున్నాయి. గతేడాదిలో పోలిస్తే 750 సీట్లు పెరిగాయి.

  • భారతదేశము లో
మరో 3,595 వైద్య సీట్లు ,1,442 పీజీ సీట్లు కూడా -ఎంసీఐ ఆమోదం
వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాది కొత్తగా 3,595 ఎంబీబీఎస్‌ సీట్లు, 1,442 పీజీ వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే 20 కళాశాల్లో 2,400 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో అదనంగా 1,195 సీట్ల భర్తీకి ఆమోదం తెలిపినట్లు ఎంసీఐ వర్గాలు పీటీఐ వార్తాసంస్థకు తెలిపాయి. ఇప్పటికే కొత్తగా ఏర్పాటయ్యే ఆరు 'ఏయిమ్స్‌' తరహా సంస్థల్లో 300 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. మరోవైపు పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుతూ ఎంసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లోనే అదనంగా 1,326 ఎండీ/ఎంఎస్‌ సీట్లు, 116 డీఎం/ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కళాశాల: ఎంసీఐ ఆమోదం పొందిన నూతన కళాశాలల్లో తొమ్మిది ప్రభుత్వ రంగానికి చెందినవి, 11 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో కొత్త కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 335 కళాశాలల్లో 41,569 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఎంసీఐ తీసుకున్న తాజా నిర్ణయాలతో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 45 వేలు దాటింది.

ఏడు రాష్ట్రాల్లోనే 69 శాతం సీట్లు!: దేశంలోని 69 శాతం వైద్య సీట్లు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గోవాలో ఉన్నాయి. మధ్య భారతంలో కేవలం 5 శాతం సీట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈశాన్య భారతంలో 3 శాతం, ఉత్తర భారతంలో 16 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాజమాన్య కోటాలో ఒక్కో సీటుకు రూ.5.50 లక్షలు తీసుకోవాలనే నిబంధన ఉన్నా ప్రైవేటు యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు . నిబంధనల ప్రకారం... యాజమాన్య కోటాలోని ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ విషయంలో దరఖాస్తు చేసుకోవడానికి అందరికీ అవకాశం కల్పించాలి. ఒక్కో కళాశాలకు వచ్చిన దరఖాస్తుల నుంచి మెరిట్‌ జాబితాను తయారుచేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు తీసుకుని సీట్లు ఇవ్వాలి. ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. సీట్ల భర్తీలో అక్రమాలకు తావులేకుండా చేయడానికి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకునే విధానాన్ని అమలు చేయడం చక్కటి పరిష్కారమని వైద్య విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ సాగదీత వైఖరి 'సీటుకు రేటు' విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే ఉందనే విమర్శలొస్తున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం అమల్లోకి రాకుండా చేయడానికి మరోవైపు ప్రైవేటు యాజమాన్యాలు ఉన్నత స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
  • ==========================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site