Saturday, April 24, 2010

ఉద్దానములో కిడ్నీ వ్యాదులు , Kidney diseases in Uddanam of Srikakulam dist






మూత్రపిండాల వ్యాధులు ఉద్దాన ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. గతంలో 25 శాతం వ్యాధిగ్రస్థులున్నట్లు తేల్చగా తాజా సర్వే ప్రకారం 40 నుంచి 50 శాతం వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం కలవరానికి గురిచేస్తోంది. ప్రభుత్వం ఒక పక్క సర్వేలు, సమీక్షల పేరిట కాలం గడుపుతుండగా ఎటువంటి వైద్య సహాయం అందక రోగులు మరణిస్తున్నారు. అమెరికాకు చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల బృందం ఇటీవలే సర్వే నిర్వహించింది. నీటి నమూనాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో క్రిమి సంహారక మందుల వినియోగం అధికంగా ఉండటం వల్లే ఈ వ్యాధి ప్రబలుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

పరిస్థితి

* గుణుపల్లికి చెందిన 25 ఏళ్ల యువకుడు చొక్కర దేవరాజు వివాహానికి సిద్ధమయ్యారు. ఇటీవల పెళ్లిచూపులు జరిగాయి. దురదృష్టవశాత్తు మూత్రపిండాల వ్యాధితో మృతిచెందాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. వారిని పెంచి పోషిస్తాడనుకున్న వ్యక్తి మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు మాకమ్మ, అప్పన్నలకు వేదనే మిగిలింది.

* కొండపల్లికి చెందిన ఎంపల్లి మోహన్‌రావు (35) కిడ్నీ వ్యాధితో నాలుగు రోజుల కిందట మృతిచెందాడు. మెట్టూరుకు చెందిన దాసిర డిల్లమ్మ ఇదే వ్యాధితో ఇటీవల మృతిచెందారు. బైపల్లికి చెందిన 18 ఏళ్ల యువకుడు చీకటి ప్రసాద్‌ అయిదు నెలల కిందట మృత్యుపాలయ్యాడు.

* అక్కుపల్లికి చెందిన లండ వెంకటమ్మ (55)కు కాళ్ల పొంగులు రావడంతో విశాఖపట్నం వెళ్లి వైద్యం చేయించుకోగా కిడ్నీ వ్యాధి ఉందని నిర్ధరించారు. నాలుగు నెలలకే వ్యాధి తీవ్రతతో ఆమె మంచం పట్టి మృత్యువుతో పోరాడుతోంది. యు.ఆర్‌.కె.పురం, గుణుపల్లి, మెట్టూరు, గడూరు, అక్కుపల్లి, సైనూరు, తదితర గ్రామాలకు చెందిన వారు ఏటా పదుల సంఖ్యలో తనువు చాలిస్తున్నారు.


ఏటా సర్వేల పేరిట ప్రత్యేక వైద్య బృందాలు వచ్చి వెళ్తున్నాయి తప్ప ఫలితాలు లేవంటూ ఉద్దానం, తీర ప్రాంతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికీ ఆరుసార్లు చేపట్టిన సర్వేలు ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రక్త, నీటి నమూనాలు సేకరించి వెళ్లినా వ్యాధికి గల కారణాలు గుర్తించలేకపోయారంటూ గుణుపల్లికి చెందిన తిర్రి లక్ష్మినారాయణ, కె.నిరంజన్‌, జి.ఆనంద్‌, టి.భాస్కరరావులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల అమెరికాకు చెందిన వైద్య బృందం మెట్టూరు వచ్చి వెళ్లారు.

డయాలసిస్‌ కేంద్రాలు

కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలసిస్‌ చేసుకునేందుకు రూ.వేలు అప్పులు చేస్తూ విశాఖపట్నం కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వీరికి అవసరమైన డయాలిసిస్‌ యూనిట్లను శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య గతంలో ప్రకటించారు. నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు.

బాధితులకు అందని సాయం
ఉద్దానంలో మృత్యుఘంటికలు మోగుతునే ఉన్నాయి. 2000లో మూత్రపిండాల వ్యాధి లక్షణాలు కొన్ని గ్రామాల్లో కనిపించే సరికి సాధారణ విషయంగానే వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కొట్టి పారేశారు. ఆ తర్వాత తీవ్రతను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారం కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని పేర్కొన్నా వాస్తవానికి మృతుల సంఖ్య వేలల్లో ఉంది. కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, సోంపేట, మందస, పలాస మండలాల పరిధిలో మృతుల సంఖ్య పదివేలకు పైబడి ఉంటుందని భావిస్తున్నారు. అప్పటి విశాఖ కె.జి.హెచ్‌. సూపరింటెండెంట్‌ రవిరాజు నేతృత్వంలో అధికారుల బృందం 2006లో కవిటి, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని వ్యాధి ఉద్ధృతి అధికంగా ఉన్న గ్రామాల్లో పర్యటించింది. రోగులతో పాటు ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించింది. తాగునీరు, ఆహార అలవాట్లు, వంశపారంపర్య వ్యాధుల గురించి వివరాలు తీసుకొని అమెరికాకు చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో అక్కడి నిపుణులతో కలిపి అధ్యయనం చేయించింది. అదే సమయంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, అమెరికాలోని స్టోనీబ్రూక్‌ విశ్వవిద్యాలయాలు వ్యాధి ఉద్ధృతిపై అధ్యయనం చేశాయి.

క్రిమి సంహారక మందుల ప్రభావం

తాజా విశ్లేషణల ప్రకారం తాగునీటిలో సమస్యలు పెద్దగా లేవని, క్రిమి సంహారక మందుల వినియోగం ఎక్కువగా ఉండటం మూలంగానే వ్యాధులు ఎక్కువైనట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే దీన్ని వారు ధ్రువీకరించడంలేదు. విశాఖపట్నంలో డయాలసిస్‌ కేంద్రాలున్నా స్థానికులకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. విశాఖపట్నానికి రానుపోను దూరం 200 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అందని సాయం
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు వైద్యం పొందాలంటే నెలకు నగదు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతుంది. వైద్య పరీక్షలు, మధుమేహం, రక్తపోటు నియంత్రణ, పౌష్ఠికాహారానికి నెలకు కనీసం రూ.3 వేలకు వరకు ఖర్చు అవుతుంది. ప్రారంభదశలో వ్యాధిని గుర్తిస్తే క్రమం తప్పకుండా మందులు వాడితే మరికొంత కాలం జీవించే అవకాశముంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు వాటిని భరించే స్థితిలో లేరు. ఈ ప్రాంతంలో అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రత్యేక చర్యలు
ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా చర్యలు ప్రారంభించనుంది. వ్యాధికి గల కారణాలపై ఇప్పటికే వైద్య బృందాలు ఉద్దానంలో సర్వే ప్రారంభించింది.

మూలము = విజయసారథి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, శ్రీకాకుళం.

రిమ్స్ లో డయాలిసిస్ కేంద్రము (Dialysis in Srikakulam )

దివంగత ముఖ్యమంత్రి డా. రాజసేఖర రెడ్డి పుణ్యమా అని. . శ్రీకాకుళంలో RIMS medical college పెట్టడం జరిగినది . అన్ని వైద్యసదుపాలల్తో పాటు డయాలిసిస్ కూడా నెలకొల్పడం దానిమూలంగా సుమారు సమ్వత్సరానికి వందలాది మూత్రపిండాల వ్యాదిగ్రస్తులు ముఖ్యము గా ఉద్దానము ప్రాంతం వారు లబ్దిపొందుతున్నారు .
ఎలా సంప్రదించాలి :
కిడ్నీ రోగులు రిమ్‌స్ లో ఒ.పి. విభాగము లో పేరు నమోదు చేయించుకుంటే మడికల్ వార్డ్కు పంపిస్తారు . అక్కడ " క్రియాటినిన్‌ , బ్లడ్ యూరియా తదితర పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించి డయాలిసిస్ అవసరమా లేదా మందులతో తగ్గించవచ్చా? అనేది నిర్ణయిస్తారు . డయాలిసిస్ విభాగము చీప్ అధ్వర్యము లో అవసరమైనవారికి నిర్ధేశిత పట్తిక ప్రకారము చికిత్స ప్రారంభిస్తారు . ఈ క్రమములో రోగుల జీవన ప్రమాణము పెంచుతూ ఉంటారు . ఒక పేసెంటుకి అవసరాన్ని బట్టి నెలకు 08 సార్లు డయాలిసిస్ చేస్తారు .
మూత్ర పిండాలు ఎలా పనిచేస్తాయో అవగాహన :
మానవ శరీరములో వెన్నెముకకు ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఒక్కోక్కటి 10 నుండి 12 సెంటీమీటర్లు చుట్టుకొలత , 150 గ్రాముల బరువు ఉంటుంది. రోజుకి మొత్తం మీద 1.5 నుంచి 2.0 లీటర్ల వరకు మూత్రాన్ని తయారుచేస్తాయి . రక్తాన్ని వడపోసి యూరియా , క్రియాటినిన్‌ వంటి మలిన పదార్ధాలను మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తాయి. శరీరములో నీటిశాతాన్ని , లవణ పరిమాణాన్ని క్రమబద్దీకరిస్తాయి.
చెడిపోవడానికి కారణాలు - అవగాహన :
మధిమేహము , రక్తపోటు , ఉబ్బుకామెర్ల , అధికమొత్తం లో నొప్పినివారణ మాత్రలు తినడము , మూత్రపిండాలలో రాళ్లు , పుట్టుకతో వచ్చే కిడ్నీ వ్యాధులు , మూత్రకోశ , మూత్రనాళ వ్యాధులు , ఎక్కువ వాంతులు , విరోచనాలు వల్ల కలిగే డిహైడ్రేషన్‌ , మలేరియా మున్నగునవి .
నివారణ చర్యల అవగాహన :
రక్తపోటు , మధుమేహ వ్యాధులు అదుపులో ఉంచుకోవడము ,
తీసుకునే ఆహారములో ఉప్పును క్రమబద్ధీకరించుకోవడం ,
రోజూ తగు మోతాదులో నీరు త్రాగడం,
కుటుంబకులో ఎవర్కైనా కిడ్నీవ్యాదు ఉంటే మిగిలినవారు వైద్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ,
వ్యాధి లక్షణాలు - అవగాహంకోసం :
అధిక రక్తపోటు , నిష్షత్తువుగా ఉండడం , ఆకలి మందగించడం , వాంతులు , దురద , ఒళ్ళు నొప్పులు , శరీరంతా వాపు , మూత్రము ఎక్కువసార్లు రావడం , చిన్న పిల్లలలో ఎదుగుదల లేకపోవడం , మూత్రం లో మంట , మూత్రం ఎరుపురంగులో పడ్డం , మున్నగునవి .... ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి .

  • =========================================
Visit My Website - > dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site