Monday, July 16, 2012

వ్యవసాయ బీఎస్సీ కోర్సుల అవగాహన 2012, AgBsc coures Awareness 2012





వ్యవసాయ బీఎస్సీ కోర్సుల సీట్లకు తీవ్ర కొరత .డిమాండ్‌ అధికం.. సీట్లు స్వల్పం ---రాష్ట్రంలో ఉన్నవి 620. గతేడాది 11 వేల మంది పోటీ .17 రెట్ల అధిక డిమాండ్‌
సీట్లు, కళాశాలల పెంపుపై శ్రద్ధ చూపని సర్కారు
-
వ్యవసాయ అభివృద్ధే తమ ధ్యేయమని నిరంతరం చాటుకునే ప్రభుత్వం... రైతులకు సాయపడే వ్యవసాయ విద్యపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ డిగ్రీ కోర్సుల సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వీటికి పోటీపడే విద్యార్థుల సంఖ్య చాలా అధికంగా (17 రెట్లు ఎక్కువ) ఉంటోంది. రాష్ట్రంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 8 కాలేజీల్లో 'వ్యవసాయ బీఎస్సీ'(ఏజీ బీఎస్సీ) కోర్సును నిర్వహిస్తోంది. గతేడాది వరకూ సీట్లు కేవలం 500 మాత్రమే ఉండగా ఈ విద్యాసంవత్సరం నుంచి మరో 120 పెంచడానికి సర్కారు తాజాగా అనుమతించింది. అంటే మొత్తం 620 కాగా ఇందులో 40 శాతం మాత్రమే రైతుల పిల్లలకు రిజర్వుచేశారు. వాస్తవానికి గతేడాది 500 సీట్లకు 11 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఎంసెట్‌లో 7 వేలలోపు ర్యాంకు వస్తే తప్ప ఏజీ బీఎస్సీ సీటు ఓపెన్‌ కేటగిరిలో రాని పరిస్థితి నెలకొంది. ఈ డిగ్రీ కోర్సు నిర్వహణకు కనీసం మరో వెయ్యి సీట్లు అదనంగా పెంచాలని ఐదేళ్ల క్రితమే విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి విన్నవించింది. కళాశాలల సంఖ్య పెంపునకు కూడా ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఉన్న కాలేజీల్లో కూడా కనీస సౌకర్యాలు లేవు. పాఠ్యాంశాల బోధనకు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. వాటి భర్తీకి కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో వ్యవసాయ కాలేజీ పెట్టి 20 సంవత్సరాలు దాటినా ఇంతవరకూ పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించలేదు. జగిత్యాల, రాజమండ్రి, మహానంది తదితర చోట్ల ఉన్న కాలేజీలదీ ఇదే దుస్థితి.

* రాష్ట్రంలో బాగా డిమాండు ఉన్న మరో కోర్సు 'గృహవిజ్ఞాన శాస్త్రం బీఎస్సీ'(హోంసైన్స్‌)దీ ఇదే దుస్థితి. హైదరాబాద్‌లో మాత్రమే ఈ కోర్సు ఉంది. ఎన్నో ఏళ్ల విన్నపాల అనంతరం ఈ ఏడాది నుంచి గుంటూరులోనూ ప్రారంభానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కానీ అనుమతించలేదు. ఈ ఏడాది ఈ కోర్సులో అదనంగా 20 సీట్లు పెంచారు.

* ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో బాగా డిమాండు ఉన్న మరో కోర్సు 'కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌'(సీఏబీఎం). అయితే దీని గురించి విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. కానీ బీఎస్సీ(సీఎంబీఎం) చేసిన వారికి ఉద్యోగావకాశాలు బాగా ఉన్నాయి. దీని తరవాత ఇదే కోర్సులో ఎంబీఏ చేయడానికి కూడా అవకాశం ఉంది.

* ఈ ఏడాది నుంచి కొత్తగా 'ఆహారశాస్త్రం, పోషకాహారం-బీఎస్సీ'(ఫుడ్‌సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌) కోర్సును 25 సీట్లతో ప్రారంభిస్తున్నారు. ప్రజలకు ఆహారంపై అవగాహన పెరుగుతున్నందున ఈ కోర్సు చేసే ఉపాధి అవకాశాలు ఎక్కువే ఉంటాయి.
24 వరకూ దరఖాస్తు గడువు
వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు గడువు ఈ నెల 24 వరకూ ఇచ్చాం. ఇంటర్‌ బైపీసీలో చదివి ఎంసెట్‌ ర్యాంకు సాధించిన వారు వీటికి అర్హులు. రంగా వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడు చేసి నింపి పంపాలి. ఇలా పంపిన వారికి వెబ్‌ కౌన్సిలింగ్‌లో ఆప్లన్లు ఇవ్వడానికి వచ్చేనెల 22 తరవాత అవకాశం ఇస్తాం. ఈ తేదీలను తరవాత మళ్లీ ప్రకటిస్తాం. వెబ్‌ కౌన్సిలింగ్‌లో ఆప్షన్లు ఇవ్వడానికి 11 కేంద్రాలలో అవకాశం కల్పిస్తున్నాం. బీఎస్సీ హోంసైన్స్‌ కోర్సులకు మాత్రం నేరుగా వచ్చేనెల 6న కౌన్సిలింగ్‌ నిర్వహిస్తాం. పల్లెల్లో పదో తరగతి వరకూ చదివి, కనీసం 3 ఎకరాల పొలం ఉన్న రైతుల పిల్లలకు 'రైతుకోటా'లో 40 శాతం సీట్లు ఇస్తాం.

మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www.angrau.net లో చూడవచ్చు లేదా సెల్‌ నెంబరు 9989623832కు ఫోన్‌చేయవచ్చు.

- మీనాకుమారి, రిజిస్ట్రార్‌, రంగా వర్సిటీ

  • ====================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site