Sunday, July 15, 2012

Admission chances of MBBS in 2012 ,ఎంబీబీఎస్‌లో ప్రవేశం...2012 ఎవరికెంత అవకాశం?



2012 ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి కొద్దిరోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు తాజా మార్కుల జాబితాను విడుదల చేయగా ఎంసెట్‌ ర్యాంకులను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా వైద్యవిద్య అభ్యసించదలిచిన విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు పొందే అవకాశాలేమిటో విశ్లేషిద్దాం!

ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగంతో పోలిస్తే మెడికల్‌ సీట్ల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువ. ఇంజినీరింగ్‌ సీట్ల సంఖ్య పరీక్ష రాసినవారి సంఖ్య కంటే అధికంగానే ఉంది కాబట్టి ఏదో ఒక కళాశాలలో చేరొచ్చనే భరోసా ఉంటుంది. కానీ మెడికల్‌ సీట్లు 4950 మాత్రమే ఉండగా ఈ విభాగంలో పరీక్షను 90,000 మందికి పైగా రాశారు! వీటిలో దాదాపు 500 సీట్లు మైనారిటీ కళాశాలల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి సీటుకూ 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పొచ్చు.

ఈ విభాగంలో ఏ విద్యార్థి అయినా సాధారణంగా మెడికల్‌ సీటు వస్తుందా, కనీసం బీడీఎస్‌ అయినా చేరే వీలుందా అనే ఆలోచిస్తుంటాడు. గత సంవత్సరం ర్యాంకుల విశ్లేషిస్తే సీట్ల లభ్యతపై నిర్థారణకు వచ్చే అవకాశం ఉంటుంది.

గత ఏడాది ర్యాంకుల పట్టికలన్నీ తుది విశ్లేషణలను తెలుపుతాయే కానీ తొలి కౌన్సెలింగ్‌ని కాదు. మెడికల్‌ విభాగంలో తుది కౌన్సెలింగ్‌నే ఆధారంగా తీసుకోవాల్సివుంటుంది. మొదటి కౌన్సెలింగ్‌కూ, రెండో కౌన్సెలింగ్‌కూ కనిపించే తేడా గమనిస్తే.. రిజర్వేషన్‌ విభాగాల్లోని విద్యార్థులు తొలి కౌన్సెలింగ్‌లో జనరల్‌ కేటగిరి సీటు సాధించి మళ్ళీ రిజర్వేషన్‌ ఉపయోగించుకుని వేరే కాలేజీకి మారవచ్చు. అలాంటపుడు ఆ సీట్ల భర్తీ కూడా రెండో కౌన్సెలింగ్‌లో జరుగుతుంది. ఇలా కొన్ని మార్పులు రెండో కౌన్సెలింగ్‌లో ఉంటాయి. ఆ తర్వాత జరిగే ఏ కౌన్సెలింగ్‌కూ పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు.

  • తొలి... తుది కౌన్సెలింగ్‌
గత ఏడాది తొలి కౌన్సెలింగ్‌లో- ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో 600 ర్యాంకు లోపలే సీట్లు భర్తీ అయ్యాయి. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 800 ర్యాంకు వరకూ, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో 1000 ర్యాంకు వరకూ ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు లభించాయి. అయితే తుది కౌన్సెలింగ్‌లోకి వచ్చేటప్పటికి పరిస్థితి మారింది...

* ఉస్మానియా పరిధిలో- ప్రభుత్వ కళాశాలలో 1000 ర్యాంకులోపు, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరి ఎ లో 1600 ర్యాంకు లోపు, బి లో 1750 ర్యాంకులోపు సీట్లు వచ్చాయి.

* ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో- ప్రభుత్వ కళాశాలలో 1250 ర్యాంకు లోపు, ప్రైవేటు కేటగిరీ ఎ లో 2100 ర్యాంకు లోపు, బి లో 2100 ర్యాంకు లోపు సీట్లు లభించాయి.

* శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో- ప్రభుత్వ కళాశాలలో 1700 ర్యాంకు లోపు, ప్రైవేటు కేటగిరీ ఎ లో 2200 ర్యాంకు లోపు, బి లో 2400 ర్యాంకు లోపు సీట్లు లభించాయి.

ఇక్కడ కేటగిరి ఎ-బి లలోని మార్పు ఫీజు మాత్రమే! మిగిలిన అంశాల్లో తేడా లేదు కాబట్టి కేటగిరి బి లో సీటు వచ్చినా సీటు తీసుకోవడం మంచిదే! ఈ ఏడాది విద్యార్థులు మంచి కాలేజీ కావాలనో, కేటగిరి బిలో సీటు వద్దనుకునో లాంగ్‌ టర్మ్‌లో చేరటం అర్థం లేని పనేనని చెప్పొచ్చు! ఎందుకంటే.. ఈ విద్యార్థులు లాంగ్‌ టర్మ్‌కు సిద్ధమయ్యేట్టయితే- పరీక్షా విధానం ఇంకా తెలియదు. మారిన సిలబస్‌ చదవాల్సివుంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.

  • కనిష్ఠ వయసు...
కౌన్సెలింగ్‌లో కొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నది- వయసు గురించి. ఎంబీబీఎస్‌ ప్రవేశానికి కనిష్ఠ వయసు నిబంధన ఉంది. విద్యార్థి 17 సంవత్సరం పూర్తిచేసివుంటేనే ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి అర్హత కల్పిస్తున్నారు. ఇలా ప్రతి ఏడాదీ 100లోపు ర్యాంకు సాధించి సీటు పొందలేకపోతున్నవారు ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. ఇది ఎంసీఐ నిబంధన కాబట్టి దీనిలో ఎలాంటి సడలింపూ ఉండదు. ఈ ఏడాది చేరేగోరే విద్యార్థులకు డిసెంబర్‌ 31, 2012లోపు కచ్చితంగా 17వ సంవత్సరం పూర్తయివుండాలి. ఒక్కరోజు తేడా ఉన్నా నిబంధనల్లో ఎలాంటి సడలింపూ ఉండదు.

  • లోకల్‌, నాన్‌ లోకల్‌ విషయాలకొస్తే...
రాష్ట్రాన్ని మూడు విశ్వవిద్యాలయాల (ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర) పరిధులుగా విభజించారు. ఒక్కో విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న సీట్లను 85 శాతం లోకల్‌ విద్యార్థులకూ, మిగిలిన 15 శాతం నాన్‌ లోకల్‌ (మిగతా రెండు యూనివర్సిటీల పరిధుల) విద్యార్థులకూ కేటాయిస్తారు. ఏ యూనివర్సిటీ పరిధిలో గత ఏడేళ్ళలో అధికశాతం- అంటే 4 సంవత్సరాలు/ఆపైన ఉండటం, చదువుకోవడం జరుగుతుందో ఆ
యూనివర్సిటీ పరిధిలో లోకల్‌ అని నిర్ణయిస్తారు.

  • గత ఏడాది సీట్లు సాధించిన చివరి ర్యాంకులు
గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3 విశ్వవిద్యాలయాల పరిధిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లలో తుది ర్యాంకులు
ఇతర కోర్సులూ ఉన్నాయ్‌...
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆస్కారం లేని ఎంసెట్‌ ర్యాంకులు వచ్చినవారు ఏం చేయాలి? వీరు ఇతర వైద్య కోర్సుల్లో చేరే విషయం పరిశీలించవచ్చు. అలాంటి వారికోసం- ప్రత్యామ్నాయ సనాతన, సంప్రదాయ వైద్యం, పారామెడికల్‌ కోర్సుల్లో చేరేందుకు కావలసిన అర్హతలు, అవకాశాలను ఇక్కడ ఇస్తున్నాం.

  • ఆయుర్వేద డిగ్రీ (బి.ఎ.ఎం.ఎస్‌) కోర్సు
రాష్ట్రంలో మొత్తం నాలుగు ప్రభుత్వ, మూడు ప్రైవేటు ఆయుర్వేద కళాశాలలున్నాయి. 170 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేస్తుంది. ఎంసెట్‌- 2012 బైపీసీ కోర్సులో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు మెరిట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ను చేపడతారు. కౌన్సెలింగ్‌ తేదీకి ఆయుష్‌ విభాగ అనుమతులున్న కళాశాలల్లో సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్‌ చేపడతారు.
  • * డాక్టర్‌ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (విజయవాడ): 30 సీట్లు
  • * అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (వరంగల్‌): 50 సీట్లు
  • * డాక్టర్‌ బి.ఆర్‌.కె.ఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద (హైదరాబాద్‌): 50 సీట్లు
  • * శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల (తిరుపతి): 40 సీట్లు
  • * ఎం.ఎన్‌.ఆర్‌.ఆయుర్వేద ప్రైవేటు కళాశాల (సంగారెడ్డి): 50 సీట్లు
  • * వాగ్దేవి ఆయుర్వేద ప్రైవేటు కళాశాల (వరంగల్‌): 50 సీట్లు
  • * వాగీశ్వరి ఆయుర్వేద ప్రైవేటు కళాశాల (కరీంనగర్‌): 50 సీట్లు
హోమియో (బి.హెచ్‌.ఎం.ఎస్‌.) కోర్సు
మొత్తం నాలుగు ప్రభుత్వ, రెండు ప్రైవేటు హోమియో కళాశాలల్లో 280 వరకూ సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. ఎంసెట్‌ మెరిట్‌ ఆర్డర్‌ ప్రకారమే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుంది.
  • * డాక్టర్‌ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల (రాజమండ్రి): 50 సీట్లు
  • * డా.గురురాజ్‌ హోమియో వైద్య కళాశాల (గుడివాడ): 40 సీట్లు
  • * జె.ఎస్‌.పి.ఎస్‌ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల (హైదరాబాద్‌): 60 సీట్లు
  • * ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల (కడప): 30 సీట్లు
  • * మహారాజ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ హోమియో ప్రైవేటు కళాశాల ( విజయనగరం): 50 సీట్లు
  • * దేవ్స్‌ హోమియో ప్రైవేటు కళాశాల (హైదరాబాద్‌): 50 సీట్లు

యునానీ (బి.యు.ఎం.ఎస్‌.) కోర్సు :
రాష్ట్రంలో రెండు యునానీ కళాశాలలున్నాయి. దీనికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష (బి.యు.ఎం.ఎస్‌.సెట్‌)ను హెల్త్‌'వర్సిటీ నిర్వహించి ర్యాంకులు, మెరిట్‌ ఆర్డర్‌ను ప్రకటిస్తుంది. మొత్తం 110 సీట్లున్నాయి.
  • * నిజామియా టిబ్బి ప్రభుత్వ యునానీ కళాశాల (హైదరాబాద్‌): 60 సీట్లు
  • * డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ యునానీ కళాశాల (కర్నూలు): 50 సీట్లు.

నాచురోపతి (బి.ఎన్‌.వై.ఎస్‌.) కోర్సు
రాష్ట్రంలో ఇక ప్రభుత్వ, రెండు ప్రైవేటు నాచురోపతి కళాశాలలున్నాయి. వాటిల్లో 80 సీట్లను మాత్రమే కన్వీనర్‌ కోటాలో యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే కౌన్సెలింగ్‌ చేపడతారు.
  • * గాంధీ న్యూరోపతిక్‌ వైద్య కళాశాల (హైదరాబాద్‌): 30 సీట్లు
  • * నారాయణ యోగా అండ్‌ నాచురోపతి ప్రైవేటు వైద్య కళాశాల: 100 సీట్లు
  • * దేవ్స్‌ నాచురోపతి వైద్య కళాశాలకు కొత్తగా ఈ ఏడాది అనుమతి లభించింది.

ఫిజియోథెరపీ (బి.పి.టి.) కోర్సు

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 38 ఫిజియోథెరపీ కళాశాలలున్నాయి. 1640 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ప్రాతిపదికన మెరిట్‌ ఆర్డర్‌ కేటాయించి కౌన్సెలింగ్‌ చేపడతారు. ప్రైవేటు కళాశాలలో సీట్లను 60 శాతం కన్వీనర్‌ కోటా, 40 శాతం యాజమాన్య కోటాలో భర్తీ చేయనున్నారు.

  • బీఎస్సీ నర్సింగ్‌ (నాలుగేళ్లు) కోర్సు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు ప్రభుత్వ, 205 ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలున్నాయి. వాటిల్లో సుమారు 10,400 సీట్లు అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ బైపీసీ గ్రూపులో చదివిన విద్యార్థులు ఎంసెట్‌-2012 ర్యాంకు ఉన్నవారు మాత్రమే అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఇప్పటికే పొందుపర్చి, జులైలో కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి హెల్త్‌'వర్సిటీ కసరత్తు చేస్తోంది.

  • బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు
రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 54 ప్రైవేటు ల్యాబ్‌ టెక్నాలజీ కళాశాలలుండగా వాటిల్లో 2,035 సీట్లను కన్వీనర్‌ కోటాలో హెల్త్‌'వర్సిటీ భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు లభిస్తాయి. ఎంసెట్‌ ర్యాంకుల మెరిట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

- (న్యూస్‌టుడే, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం)

  • ======================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site