Monday, July 16, 2012

ఫార్మశీ కోర్సులు అవగాహన - Pharmacy courses Awareness,ప్రకాశిస్తున్న ఫార్మసీ


  • Pharmacy courses Awareness
ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సులు కాకుండా మేలైన ఇతర కోర్సుల కోసం అన్వేషించేవారికి ఫార్మసీ ఓ ప్రత్యామ్నాయం. 1950లో 10 కోట్ల టర్నోవర్‌ కలిగిన భారత్‌ ఫార్మా పరిశ్రమ గత ఏడాది 1.10 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఉపాధి సాధనకు బహుముఖ అవకాశాలున్న ఈ కోర్సు విశేషాలూ, ప్రవేశాలకు అవసరమైన ఎంసెట్‌ ర్యాంకుల వివరాలూ తెలుసుకుందాం!

రాబోయే పదేళ్లు ఫార్మా రంగానికి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. అందుచేతనే ఫార్మసీ డిగ్రీని విదేశాలలో ఉన్నత విద్యనందించే 'రెడీమేడ్‌ పాస్‌పోర్టు'గా ఫార్మసీ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాంప్రదాయిక కోర్సులకు ఉద్యోగావకాశాలు అడుగంటుతున్న నేటి తరుణంలో చాలామంది ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ ఆశాజ్యోతి ఫార్మసీ డిగ్రీ అని చెప్పవచ్చు.

మనిషి మనుగడ ఉన్నంత కాలం, అనారోగ్యాలు వెన్నాడుతున్నంత కాలం.. ఫార్మసీ రంగానికి మాంద్యం ఉండదు. గతంలో ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, మౌలిక వసతుల రంగాల్లోని వారు ఉద్యోగాలు కోల్పోయారు. కానీ అప్పుడు కూడా ఫార్మా రంగంలోని వారికి ఆ సెగ తగలకపోవడం విశేషం. అందుకనే నేడు వేలమంది ఇంటర్‌ విద్యార్థులు ఫార్మా కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు.

ఇంటర్‌లో ఎంపీసీ, బైపీపీ - రెండు గ్రూపుల వారూ చేరగలిగిన కోర్సు ఫార్మసీ!
  • ఫార్మసీలో మూడు రకాల కోర్సులు ఉన్నాయి.
* డి. ఫార్మసీ (2 సంవత్సరాలు)
* బి. ఫార్మసీ (4 సంవత్సరాలు)
* ఫార్మా.డి (6 సంవత్సరాలు).
చివరి రెండు కోర్సుల్లో సగం సీట్లు ఇంటర్‌ ఎంపీసీ వారికీ, మిగిలిన సగం బైపీసీ వారికీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ప్రాతిపదికపై కేటాయిస్తారు.
  • బి. ఫార్మసీలో ఏం చెబుతారు?
ఈ కోర్సులో ఫార్మా పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలు ఎక్కువగా ఉంటాయి. ఔషధాల తయారీ, వాటి నాణ్యత, విశ్లేషణ మొదలైన అంశాలు బోధిస్తారు. కోర్సులో భాగంగా ప్రతి విద్యార్థికీ 30- 45 రోజుల ప్రాయోగిక శిక్షణ (ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌) ఫార్మా పరిశ్రమలో తప్పనిసరి. మనదేశంలో బి. ఫార్మసీ ఇండస్ట్రీ ఓరియంటెడ్‌గా ఉండటం వల్ల ఇక్కడి ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు అన్ని దేశాలలో గిరాకీ ఉంది.
  • బి.ఫార్మసీ కాలేజీలు - సీట్లు
మనదేశంలో 1180 ఫార్మసీ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు 85 వేల బి.ఫార్మసీ సీట్లు ఉన్నాయి. వీటిలో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలలు 748 మాత్రమే. మనరాష్ట్రంలో 7 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా వాటిలో 2 యూనివర్సిటీలు ఆంధ్రా రీజియన్‌లో, 3 తెలంగాణాలో, 2 రాయలసీమలో ఉన్నాయి. వీటిలో 360 బి.ఫార్మసీ సీట్లున్నాయి. ఒక డీమ్డ్‌ యూనివర్సిటీలో 60 సీట్లున్నాయి.

రాష్ట్రంలో 292 ప్రైవేటు ఫార్మసీ కళాశాలలు ఉండగా వాటిలో 29200 సీట్లున్నాయి. వీటిలో 169 కళాశాలలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో, 87 ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో, 36 కాలేజీలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి.
  • ఫార్మా.డి. కాలేజీలు
మనదేశంలో 87 ఫార్మా.డి. కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. వీటిలో 32 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. 16 తెలంగాణాలో, 10 ఆంధ్రా ప్రాంతంలో, 6 రాయలసీమలో ఉన్నాయి. ఒక్కో కళాశాలలో 30 సీట్లు మాత్రమే ఉంటాయి.
ఫార్మా.డి (డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ)
ఆరేళ్ల ఫార్మా.డి. కోర్సు పూర్తిగా క్లినికల్‌ ఓరియంటెడ్‌గా ఉంటుంది. ఈ కోర్సులో క్లినికల్‌ ఫార్మసీ, డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌, పేషెంట్‌ కౌన్సెలింగ్‌, ఫార్మకో కైనిటిక్స్‌, ఫార్మకో డైనమిక్స్‌ వంటి అంశాలు బోధిస్తారు.

ఫార్మా.డి. విద్యార్థులకు 2,3,4 సంవత్సరాల్లో తరగతి లెక్చర్లతో పాటు ఆస్పత్రి సందర్శనలు కూడా ఉంటాయి. ఐదో సంవత్సరంలో ప్రతిరోజూ ఉదయంపూట ఆస్పత్రిలో పేషెంట్‌ బెడ్‌ సైడ్‌ రౌండ్లు ఉంటాయి. ఆరో సంవత్సరం పూర్తిగా ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేయాలి.

అందుచేతనే ప్రతి ఫార్మా.డి. కాలేజీకి కనీసం మూడొందల పడకలు గల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో ఒప్పందం ఉండాలి. ఈ ఫార్మా.డి. కోర్సుని మనదేశంలో 2008లో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. మొదటి ఫార్మా.డి. బ్యాచి 2014లో కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తోంది.

  • మన రాష్ట్రంలో...
భారత్‌లో తయారవుతున్న ఔషధ పదార్థాల్లో మూడో వంతు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతుండటం విశేషం. అలాగే ఫార్మా ఫార్ములేషన్లు, ఫార్మా బయోటెక్‌ రంగాల్లో కూడా మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయంగా పేరొందిన ఫార్మా సంస్థలు మన రాష్ట్రంలో ఉండటం వల్ల ఫార్మసీ చదివినవారికి మనరాష్ట్రంలో అవకాశాలు ఎక్కువ.
  • ఔషధ పరిశోధనలు
వీటిలో క్లినికల్‌ రీసెర్చి అత్యంత కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ట్రయల్స్‌ జరుగుతుంటే భారత్‌లో 1200 క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్‌ జరపటానికి మనది చాలా అనుకూలమైన దేశం. త్వరలో అనేక వేల క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో మొదలు కానున్నాయి. ఈ పరిశోధనల నిమిత్తం వేలమంది ఫార్మారంగ నిపుణులు ముఖ్యంగా ఫార్మా.డి. చదివినవారు అవసరమవుతారు.

  • ఔషధ నియంత్రణ శాఖలో...
కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగాల్లోని డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్‌ ఉద్యోగానికి ఫార్మసీ చదివినవారు మాత్రమే అర్హులు. ఇవేకాక ప్రభుత్వ రంగంలోని గవర్నమెంట్‌ ఎనలిస్టు, డ్రగ్‌ ఎనలిస్టు, కెమికల్‌ ఎగ్జామినర్‌ ఉద్యోగాలకు కూడా ఫార్మసీ వారికి ప్రాధాన్యం ఇస్తారు. కల్తీ మందులు అరికట్టడంలో, ఔషధాల నాణ్యత పరీక్షించి వాటిని సరసమైన ధరలకు అందేట్లు చూడటంలో డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్లు కీలకపాత్ర వహిస్తారు.

ఇటీవల 40 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ నివేదికలో నూతన ఔషధాలకు అనుమతులు జారీ చేయటంలో జరిగిన అవకతవకలను ఎత్తి చూపారు. ఈ లోటుపాట్లు సరిదిద్దటానికీ, కల్తీ మందులు అరికట్టటానికీ దేశవ్యాప్తంగా కొన్ని వేల డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో రానున్నాయి.

  • ఇతర అవకాశాలు...
ఫార్మసీ చదివినవారికి కమ్యూనిటీ ఫార్మసిస్టుగా, హాస్పిటల్‌ ఫార్మసిస్టుగా, అప్రూవ్డ్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ లేబటెరీలో క్వాలిటీ కంట్రోల్‌ కెమిస్టులుగా దేశ విదేశాల్లో అవకాశాలున్నాయి. మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు ఫార్మా మార్కెటింగ్‌, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌లో రాణిస్తారు. ఫార్మా రెగ్యులేటరీ, ఫార్మకో విజిలెన్స్‌, క్లినికల్‌ డేటా ప్రాసెసింగ్‌లలో చాలా ఉద్యోగాలు ఫార్మసీ చదివినవారి కోసం ఎదురుచూస్తున్నాయి.
  • మంచి కళాశాల ఎంపిక ఎలా?
1. ఫార్మసీ కళాశాలకు స్వయంగా వెళ్ళి అక్కడి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి ఆ విద్యాసంస్థ ప్రమాణాలు తెలుసుకోవటం మంచిది.

2. అనుభవజ్ఞుడైన ప్రిన్సిపల్‌, సీనియర్‌ అధ్యాపకులు ఉన్న కళాశాలలను ఎంచుకోవటం ఉత్తమం.

3. గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం, జీప్యాట్‌లో ర్యాంకులు సాధించినవారి వివరాలు, ప్రాంగణ నియామక ఇంటర్వ్యూలు, పారిశ్రామిక సందర్శనలు ఉన్న కళాశాలలు మేలు.

4. ఫార్మా పరిశ్రమలోని నిపుణులతో లెక్చర్లు ఇప్పించే కళాశాల వైపు మొగ్గు చూపటం శ్రేయస్కరం.

5. పారిశ్రామిక శిక్షణలు, ఇతర ప్రత్యేక శిక్షణలను ఏర్పాటు చేసే కళాశాలలు ఉత్తమమని చెప్పవచ్చు.


-- Courtesy with Dr.Venkatareddy - director Sri datta pharmacy college




ఫార్మాలో రెండేళ్ల ఎం.ఎస్‌.

అటు ఇంజనీరింగ్‌ (ఈ) కేటగిరిలోకి, ఇటు అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌(ఎఎం) కేటగిరిలోకి కూడా వచ్చే కోర్సు ఫార్మశీ. ఈ కోర్సుకు బై.పి.సి, ఎంపిసి విద్యార్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వాతావరణ పరిస్థితుల కారణంగానో తీసుకొనే ఆహారం కారణంగానో ఆరోగ్య సంబంధమైన సమస్య లు ఉత్పన్నం కావడం సాధారణం అయి పోతున్న నేపథ్యంలో వైద్యులు అవసరమూ ఎక్కువుతోంది. ప్రాథమిక శాస్త్రీయ సిద్ధాంతాలను వ్యాధి లక్షణాలకు అనువర్తింప జేయడం ద్వారా కొత్త పాత్ర వహించే వాడు ఫార్మసిస్ట్‌. మందుల, పరిశోధన, రూపకల్పన, తయారీ అభివృద్ధి మొదలైన ముఖ్యమైన అంశాలపై కృషి చేసే సుశిక్షతులను ఔషధ రంగానికి అందించే కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మశి. ఈ కోర్సుకాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. బి.పార్మసి చేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోని వివిధ డిపార్టు మెంటులలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌,డ్రగ్‌ ఎనలిస్ట్‌, డ్రగ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ వంటిఉద్యోగాలలో ప్రవేశిం చవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రు లలో హాస్పిటల్‌ ఫార్మసిస్ట్‌,క్లినికల్‌ ఫార్మసిస్ట్‌ హాస్పిటల్‌ మాన్యుఫాక్చ రింగ్‌ ఫార్మసిస్ట్‌

ఉద్యోగాలు పొంద వచ్చు.

ఈ కోర్సు చేసినవారికి స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విస్తరిస్తున్న మందుల పరిశ్రమలకు అవసర మయ్యే వివిధ రకాల ఉత్పత్తులు క్యాప్య్సూల్స్‌ (గొట్టాలు), సీసాల (యాంపుల్స్‌ వంటివి) తయారు చేసే ఆక్జిలరీ యూనిట్లు స్థాపించుకోవచ్చు. వివిధ కంపెనీలకు ట్రయల్‌ ప్రొడక్ట్స్‌ అందించే ప్లాంట్లను ఏర్పరచు కోవచ్చు. పెద్ద కంపెనీలకు అవసరమయ్యే జాబ్‌వర్క్‌ చేసి ఇచ్చే కుటరీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. రీ ప్యాకింగ్‌ యూనిట్లు కూడా మంచి లాభదాయంగా ఉంటాయి.

భారతదేశంలో ఫార్మా పరిశ్రమ బాగా విస్తరిస్తోంది. అదే సమయంలో ఈ రంగం నిపుణులైన అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లోని ఏలియన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఫార్మాస్యూటికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌, జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)తో కలిసి రెండేళ్ల ఎం.ఎస్‌. ప్రోగ్రామ్‌లను రూపొందించింది. ఈ సంస్థ ఫార్మా పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూడు రకాల స్పెషలైజేషన్లతో ఎం.ఎస్‌. కోర్సులను అందిస్తోంది. అవి...

* ఇండస్ట్రియల్‌ ఫార్మాస్యూటిక్స్‌
* ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌
* డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేటరీ ఎఫైర్స్‌

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. బైలేయర్‌ ట్యాబ్‌లెట్‌ మెషీన్‌, ప్లానెటరీ మిక్సర్‌, వి బ్లెండర్‌, గ్రాన్యులేటర్‌, ప్రత్యేక హెచ్‌పీఎల్‌సీ ల్యాబ్‌, తదితర ఆధునిక పరికరాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. రెగ్యులేటరీ ఎఫైర్స్‌ స్పెషలైజేషన్‌తో ఎం.ఎస్‌. ఫార్మా కోర్సులు మనదేశంలో చాలా తక్కువ సంస్థల్లో ఉన్నాయి.

బోధనలో ఫార్మా కంపెనీలకు చెందిన ప్రముఖులు పాలుపంచుకుంటారు. పరిశ్రమల సందర్శన శిక్షణలో ముఖ్య భాగం. కోర్సు రెండో ఏడాదిలో ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలి. ఎం.ఎస్‌. కోర్సులో ప్రవేశం కోసం జేఎన్‌టీయూహెచ్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 9 ఆగస్టు 2012న జేఎన్‌టీయూలో జరగనుంది. ఇతర వివరాలు జేఎన్‌టీయూహెచ్‌ లేదా ఏలియన్స్‌ ఇనిస్టిట్యూట్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి



1 Govt.Polytechnic for Women Srikakulam
2 Sri Venkateswara College of Pharmacy -Sri Venkateswara College of Pharmacy
Etcherla-532402, Srikakulam Dist., Phone: 9440322016 , Email: svcp@hotmail.com

2 Sri Sivani College of Pharmacy--NH-5, Chilakalapalem Jn, Etcherla (M), Srikakulam - 532 402.
Phone: 08942-231263/ 9704012603 ,principal_da@yahoo.com-mbvraju@yahoo.co.in


  • ==================
Visit My Website - > Dr.Seshagirirao.com/ -

No comments:

Post a Comment

Your comment is very important to improve this blog/site